Ugadi Greetings: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్, కేసీఆర్
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
- By Gopichand Published Date - 10:39 PM, Sat - 29 March 25

Ugadi Greetings: రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు (Ugadi Greetings) తెలిపారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి మొదలౌతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాదినుండే ప్రారంభిస్తారని అందువల్ల ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకోవడం ప్రత్యేకతన్నారు.
కేసీఆర్ శుభాకాంక్షలు
సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాదినుండి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందన్నారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు, ఉగాది గొప్ప పర్వదినం అని కేసీఆర్ అన్నారు.
ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో, ఆది పండుగగా ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని, అదే నూతనోత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ కోరుకున్నారు. రైతన్నలు, సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టి, ప్రజల జీవితాల్లో మరింతగా గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆశించారు. అప్పుడే విశ్వావసు నామ నూతన సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని కేసీఆర్ అన్నారు.
Also Read: Hawking Radiation: హాకింగ్ రేడియేషన్ అంటే ఏమిటి?
ఉగాది పచ్చడి మాదిరి, జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతీ సందర్భాన్ని వివేచనతో ఎదుర్కోవడం ద్వారానే మంచి చెడులు అర్థమై జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని కేసీఆర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సాగునీరు తాగునీరు పుష్కలంగా లభించి, సమృద్ధిగా పంటలు పండి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు.
తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు- పవన్ కళ్యాణ్
పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు… జాతిని సజీవంగా నిలుపుతాయి. మన ముంగిళ్లకు వచ్చిన ‘ఉగాది’ తెలుగువారి వారసత్వపు పండుగ. విశ్వావసు అనే గంధర్వుడు పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ తరుణాన తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితం కష్టసుఖాల సమ్మేళనం. మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తాము. గత ప్రభుత్వ పాలన కష్టాలమయమైపోగా .. ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ముంగిటకు వచ్చింది. చైత్ర మాసపు శోభతో వసంతాన్ని మోసుకువచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది… తెలుగు లోగిళ్ళను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని పవన్ ఒక ట్వీట్ చేశారు.