Illegally Transport : కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీలు
పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో పవన్ తనిఖీలకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
- By Latha Suma Published Date - 12:37 PM, Fri - 29 November 24

Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు కాకినాడలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన యాంకరేజి పోర్టులో తనిఖీలు చేపట్టనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా కాకినాడకు బయలుదేరి వెళ్లారు. పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో పవన్ తనిఖీలకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతునట్లు సమాచారం.
అయితే ఎవరైతే ఈ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్నారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖను అనుసంధానం చేసుకుని పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని లబ్దిదారులకు అందేలా చూస్తామన్నారు. ఇకపై ఎవరు పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్‌లో అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండటంపై పవన్ ఫోకస్ పెట్టారు. అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలివెళ్లిపోతోందంటూ గగ్గోలు పెట్టిన కూటమి నేతలకు వారి సొంత ప్రభుత్వంలోనూ ఇదే సమస్య తప్పడం లేదు. కాకినాడ పోర్టులో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేస్తున్నా పరిస్దితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను కలెక్టర్, ఎస్పీ ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ షిప్ లో దాదాపు 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ షిప్ ను పరిశీలించేందుకు ఈరోజు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్తున్నారు. సౌతాఫ్రికా షిప్ తో పాటు మరో బాచి (షిప్ కు లోడు తరలించే లాంచీ)లో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని కూడా పవన్, మనోహర్ కలిసి తనిఖీలు చేపట్టనున్నారు.
Read Also: Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ…