Nara Lokesh Birthday : మంత్రి లోకేష్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ..ఇది కదా అంత కోరుకునేది !!
ఏపీ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తొలిసారిగా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
- Author : Sudheer
Date : 23-01-2026 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి మరియు నారా కుటుంబాల మధ్య సంబంధాలపై గత కొంతకాలంగా సాగుతున్న అనేక ఊహాగానాలకు తెరదించుతూ, నేడు ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తొలిసారిగా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో లోకేష్ పలుమార్లు ఎన్టీఆర్ పుట్టినరోజున విష్ చేసినప్పటికీ, తారక్ నుండి ప్రతిస్పందన రాలేదు. అయితే, ఈసారి ఎన్టీఆర్ స్వయంగా స్పందించి తన సోదరుడికి శుభాకాంక్షలు తెలపడం అటు నందమూరి అభిమానులను, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను అమితాశ్చర్యానికి మరియు ఆనందానికి గురి చేస్తోంది. ఈ ఒక్క పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Lokesh Bday 2026
ఈ పరిణామం కేవలం ఒక పుట్టినరోజు శుభాకాంక్ష మాత్రమే కాదు, ఇది రెండు కుటుంబాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకత్వం విషయంలో లోకేష్ మరియు ఎన్టీఆర్ మధ్య పోటీ ఉందనే ప్రచారం నిరంతరం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఆయనను పార్టీ వారసుడిగా చూడాలని కోరుకుంటున్న తరుణంలో, ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించేవారు. అయితే, తామిద్దరం బాగున్నామని వారు గతంలో చెబుతూ వచ్చినప్పటికీ, బహిరంగంగా ఇలాంటి ఆత్మీయ పలకరింపులు లేకపోవడం వల్ల ఆ అనుమానాలు అలాగే ఉండేవి. ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా చొరవ తీసుకోవడం ద్వారా, తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని గట్టి సంకేతాన్ని పంపారు.
ఈ పరిణామం నారా మరియు నందమూరి కుటుంబాల ఐక్యతకు అత్యంత అవసరమైన చర్యగా పరిగణించవచ్చు. రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే ఇలాంటి కుటుంబ బంధాలు మరియు ఐక్యత పార్టీ కార్యకర్తల్లో గొప్ప నైతిక బలాన్ని నింపుతాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అభిమానులకు కూడా ఈ పోస్ట్ ఒక ముగింపు పలికినట్లయింది. యువనేతలిద్దరూ పరస్పర గౌరవంతో ముందుకు సాగడం భవిష్యత్తులో రాజకీయంగా కూడా కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి, లోకేష్ 43వ పుట్టినరోజు ఈ ఆత్మీయ కలయికతో ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోయింది.
Many happy returns of the day @naralokesh! Wishing you another incredible year ahead.
— Jr NTR (@tarak9999) January 23, 2026