CM Chandrababu : ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు నూతన దిశ: ఏపీ సీఎం చంద్రబాబు
ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
- By Latha Suma Published Date - 11:32 AM, Thu - 12 June 25

CM Chandrababu : ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజల ఆకాంక్షలే తమ ప్రభుత్వం అడుగులకు బలమని పేర్కొంటూ, సేవా దృక్పథంతో ప్రతి రోజు శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ప్రకటనను షేర్ చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం. ఎన్నో సవాళ్ల మధ్య, ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడుకుల మధ్య, మేము ముందుకు సాగుతున్నాం. పేదల సేవలో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read Also: Corona : కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం
ఈ ఏడాదిలో ప్రభుత్వ సంక్షేమ హామీలు ప్రజలకు చేరేలా ఎన్నో చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్లు, దీపం-2 పథకం, తల్లికి వందనం, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు వంటి పథకాలు పెద్ద ఎత్తున అమలులో ఉన్నాయని వివరించారు. అదనంగా మెగా డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిందని వెల్లడించారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఇప్పటివరకు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఆదాయానికి భరోసా కల్పించామన్నారు. ఈ నెలలోనే ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించనున్నాం అని వెల్లడించారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టులకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఎకరానికి నీటిని అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పలు కీలక రంగాల్లో ముందడుగు వేశామని సీఎం తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభించబడిందని, పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ వేగంగా సాగుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి ప్రత్యేక రైల్వే జోన్ సాధించిన విషయం, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించడంలో ప్రభుత్వ ప్రయాసలను గుర్తు చేశారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మాకు ఊపిరిగా ఉంది. ప్రజల ఆశలే మాకు మార్గదర్శకం. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపడతామని హామీ ఇస్తున్నాను. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చంద్రబాబు అన్నారు. ఇదే ప్రజల్లో విశ్వాసం పుట్టించే పాలనకు తొలి అడుగని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత విజయవంతమైన పాలనను అందిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.