Nara Lokesh Counter: వైవి సుబ్బారెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్.. తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని..!
గత వైసీపీ ప్రభుత్వంలో భక్తులను దేవుడికి దూరం చేశారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారు. ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పాం. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి.
- Author : Gopichand
Date : 19-09-2024 - 9:23 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh Counter: ఏపీలో శ్రీవారి లడ్డూపై కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీవారి లడ్డూపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh Counter) ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై మేము స్పష్టమైన ఆరోపణలు చేశామన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో భక్తులను దేవుడికి దూరం చేశారు. అన్నదానం, లడ్డూలో నాణ్యతను తగ్గించారు. ఏడుకొండల జోలికి వెళ్ళొద్దని అప్పుడే చెప్పాం. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి వాడినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. నెయ్యిని ఎన్.డి.డి.ఎఫ్ కు పంపిస్తే జంతువుల క్రొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనె ఉందని నిర్ధారించారని మంత్రి వివరించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం.. జగన్ లాంటి సీఎంను చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడేది మేమే అని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన ఈవో లడ్డు నాణ్యతను పెంచారని మంత్రి తెలిపారు.
Also Read: Indian Railway Loss: నష్టాల్లో ఉన్న రైలు ఇదే.. ఈ ట్రైన్ వలన మూడేళ్లలో రూ. 63 కోట్ల లాస్.!
కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే వారు తీసుకున్న కమిషన్లను రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తామని తెలిపారు. వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే సుబ్బారెడ్డి తిరుపతికి వచ్చి లడ్డూ తయారీలో ఎలాంటి తప్పు జరగలేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి ఛైర్మన్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నాడు. పింక్ డైమండ్ ను రాజకీయంగా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు నా రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.