Amaravati Relaunch : మోడీని పొగడ్తలతో ముంచెత్తిన నారా లోకేష్
Amaravati Relaunch : ‘‘వంద పాకిస్తాన్‌లు వచ్చినా మోదీ ఒక్కరు సరిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.
- By Sudheer Published Date - 05:21 PM, Fri - 2 May 25

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం(Amaravati Relaunch)లో భాగంగా మంత్రి నారా లోకేష్ (Lokesh) ప్రధాని నరేంద్ర మోదీ(Modi)ని అభినందిస్తూ ఘనంగా ప్రశంసించారు. పాకిస్తాన్ ఉగ్రదాడి(Pakistan Terror Attack)ని తీవ్రంగా ఖండించిన ఆయన, భారత్‌కు మోదీ వంటి శక్తివంతమైన నాయకుడు ఉండటం గొప్ప విషయమని అన్నారు. ‘‘వంద పాకిస్తాన్‌లు వచ్చినా మోదీ ఒక్కరు సరిపోతారు’’ అని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో భారత్ భద్రతపరంగా ఎంత బలపడిందో, ప్రపంచమే ఇప్పుడు తెలుసుకుంటోందని అన్నారు. మోదీ నిర్ణయాల వల్లే పాకిస్తాన్ లో భయం మొదలైందన్నారు.
అమరావతిపై మోదీ ప్రేమ – కేంద్రం సహకారం
నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్, అమరావతిపై ఉన్న ప్రేమని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఢిల్లీలో బిజీ షెడ్యూల్ మధ్యన కూడా మోదీ అమరావతి కార్యక్రమానికి హాజరైనందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన కులగణన నిర్ణయాన్ని సంచలనాత్మకంగా అభివర్ణిస్తూ, ఇది సామాజిక న్యాయానికి దిక్సూచి అని అన్నారు. విశాఖపట్నంలో రైల్వే జోన్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, బల్క్ డ్రగ్ పార్క్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నిధులు కేటాయించడాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంభించడం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ముందడుగుగా తెలిపారు.
PM Modi : రాజధాని అమరావతికి చేరుకున్న ప్రధాని మోడీ
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు
వైసీపీ హయాంలో అమరావతిపై వ్యక్తిగత కక్షతో కుట్రలు జరిగాయని, ఒక్క ఇటుక కూడా వేయలేని దుస్థితి ఏర్పడిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జై అమరావతి’’ అని చెప్పినందుకే గతంలో ప్రజలు జైలుకెళ్లే పరిస్థితులు ఎదుర్కొన్నారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన అమరావతిని ఎవరూ ఆపలేరని ధైర్యంగా తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.