YCP : మంత్రి విడదల రజిని కార్యాలయంపై రాళ్ళ దాడి.. గుంటూరు వెస్ట్ లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆఫీస్
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైసీపీ కార్యాలయంపై గుర్తు
- By Prasad Published Date - 11:15 AM, Mon - 1 January 24

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైసీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇటీవల కొత్తగా వైసీపీ సమన్వయకర్తగా మంత్రి విడదల రజినిని అధిష్టానం నియమించింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే రజిని పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే అర్థరాత్రి వేడుకల్లో దుండగులు కార్యాలయంపై దాడి చేశారు. విద్యా నగర్ రింగు రోడ్డుకు సమీపంలో ఉన్న మంత్రి విడదల రజిని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ-జనసేన అభిమానులు, కార్యకర్తల్ని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంటన్నర పాటు రోడ్డుపై యువకులు వీరంగం సృష్టించారు. మంత్రి రజిని కార్యాలయం మీదుగా వాహనాలు వెళుతున్న క్రమంలో వైసీపీ కార్యకర్తలతో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు కవ్వించినట్టు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పార్టీ కార్యాలయం అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతోనే ఉద్రిక్తత తలెత్తిందని టీడీపీ-జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు పథకం ప్రకారమే తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని మంత్రి విడదల రజిని ఆరోపించారు. ముందే రాళ్లను తమ వెంట తెచ్చుకుని భవనంపై దాడి చేశారని ఆరోపించారు. దాడి వెనుక ఎవరున్నా తాము విడిచి పెట్టమని చెప్పారు.
Also Read: DP : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై పరిటాల శ్రీరామ్ ఫైర్.. స్వార్థం కోసం పార్టీ మారి..?