AP Tourism Policy : ఏపీ నూతన పర్యాటక పాలసీ ఆవిష్కరణ
పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ విధివిధానాలను తెలిపారు. పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని మంత్రి కందుల స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 04:57 PM, Tue - 17 December 24

AP Tourism Policy : ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-2029ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. నూతన పర్యాటక పాలసీ 2024-29పై పెట్టుబడిదారులతో మంత్రి కందుల దుర్గేష్ చర్చించి ఆహ్వానించారు. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన మంత్రి దుర్గేష్.. పెట్టుబడిదారులకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు పర్యాటక పాలసీ విధివిధానాలను తెలిపారు. పెట్టుబడి పెట్టేందుకు ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని మంత్రి కందుల స్పష్టం చేశారు.
సీఐఐ, ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో కొత్త పాలసీని విడుదల చేశారు. నూతన పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలను మంత్రి వివరించారు. పర్యాటక రంగంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి దుర్గేష్ అన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో విశాలమైన సముద్రతీరం, అద్భుతమైన చారిత్రక, వారసత్వ, ప్రకృతి సంపద, సజీవ నదులు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు వివరించిన మంత్రి పర్యాటక రంగంలో తమది సమగ్ర విధానం అని తెలిపారు.