Mini Battle Tank : వావ్.. మినీ యుద్ద ట్యాంక్ ను తయారు చేసిన కాకినాడ యువకుడు
Mini Battle Tank : పెద్దగా చదువులేమీ లేకపోయినా... ఆర్మీపై ఉన్న అభిమానంతో ఒక యువకుడు నిర్మించిన మినీ యుద్ధ ట్యాంక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- By Kavya Krishna Published Date - 12:17 PM, Wed - 2 July 25

Mini Battle Tank : పెద్దగా చదువులేమీ లేకపోయినా… ఆర్మీపై ఉన్న అభిమానంతో ఒక యువకుడు నిర్మించిన మినీ యుద్ధ ట్యాంక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాకినాడ జిల్లా యువకుడు నాగేంద్ర తన సృజనాత్మకతతో సోషల్ మీడియాలో హిట్‌గా మారాడు. యు.కొత్తపల్లి మండలం వెంకట్రాయిపురం గ్రామానికి చెందిన నాగేంద్ర ఐటీఐ ఫిట్టర్ వరకు మాత్రమే చదివాడు. ప్రస్తుతం కాకినాడలో డ్రైవర్‌గా పని చేస్తున్న అతనికి చిన్ననాటి నుంచే ఆర్మీలో చేరాలనే కల. ఈ కోరిక నెరవేరకపోయినా… ఆ కోరికకు రూపం ఇస్తూ మినీ యుద్ధ ట్యాంక్‌ను స్వయంగా రూపొందించి ప్రతిభను చాటాడు.
Zohran Mamdani : ట్రంప్ బెదిరింపులకు భయపడను.. ట్రంప్‌కు జోహ్రాన్ మమ్దానీ కౌంటర్
ఐదేళ్ల క్రితం చెక్కలతో చిన్న ట్యాంక్‌ను తయారుచేసి, కాకినాడ ఎస్పీ కార్యాలయానికి అందించిన నాగేంద్ర… ఈసారి మరింత ఆధునికంగా, ఓ ప్రోత్సాహకుడి సహాయంతో రూ. 1.80 లక్షల వ్యయంతో మినీ యుద్ధ ట్యాంక్‌ను నిర్మించాడు. దీన్ని కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ప్రదర్శనకు ఉంచగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రాక్టర్, ఆటో, బైక్ పరికరాలు, ఇనుప షీట్లు, విద్యుత్ సామగ్రిని వినియోగించి 45 రోజులపాటు శ్రమించి ఈ ట్యాంక్‌ను రూపొందించాడు. ఈ ట్యాంక్ నుంచి ప్రతి ఐదు సెకన్లకూ ఒక తూటా పేలుతుందని, మొత్తం ఆరు తూటాలు ప్రయోగించగలదని తెలిపాడు.
ఒక తూటా దాదాపు 600 మీటర్ల దూరం వరకూ వెళ్తుందట. నాగేంద్ర మాట్లాడుతూ… చిన్ననాటి నుంచి ఆర్మీకి సేవ చేయాలన్న కోరిక ఉండేదని, రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో రన్నింగ్‌లో వెనుకబడటం వల్ల అవకాశం మిస్సయ్యానన్నాడు. అయినప్పటికీ ఏదో ఒక రకంగా దేశానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ ట్యాంక్ తయారు చేశానని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయగలిగానన్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు ఎంతో ఇష్టమని, ఒకవేళ ఆయనను కలిసే అవకాశం వస్తే తన ఆర్మీ కోరికను పంచుకోవాలని ఆశపడుతున్నట్టు నాగేంద్ర చెప్పాడు. మంచి అభిరుచి, తపన, సృజనాత్మకత కలిగిన ఈ యువకుడికి మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ కేసు.. రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి