TDP membership registration : టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.
- By Latha Suma Published Date - 01:24 PM, Mon - 30 December 24

TDP membership registration : మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. 90 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన ఇప్పుడు పార్టీ సభ్యత్వాలను లక్ష దాటించారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీ మొత్తంలో సభ్యత్వాలు నమోదు కాలేదు. నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రూ. లక్ష కడితే టీడీపీకి శాశ్వత సభ్యులుగా చేరొచ్చు. ఇలాంటి శాశ్వత సభ్యత్వాలలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మంగళగిరి నిలిచిందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అఖండ విజయం సాధించిన తరువాత టీడీపీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టింది.
ఇటీవల 75 వేల సభ్యత్వాలు నమోదు అయిన తరువాత పార్టీ విస్తృత సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ను అభినందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో మంగళగిరిలో టీడీపీ సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య లక్ష దాటింది. మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో లోకేష్‌కు అరవై ఆరు శాతం ఓట్లు పడ్డాయి. దాదాపుగా లక్షా డెభ్బై వేల ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన వారంతా టీడీపీ సభ్యులు కాదు. కానీ వారిలో లక్ష మందికిపైగా టీడీపీ కుటుంబంలో భాగమయ్యేలా చేయడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటారన్న భరోసాతో రికార్డు స్థాయి సభ్యత్వాలు నమోదయ్యాయి. కుల, మత వర్గాలకు అతీతంగా లోకేష్ పై మంగళగిరిలో అభిమానం కనిపిస్తోంది. లోకేష్ కూడా ఓ పద్దతిలో పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉందన్న అహంకారం ద్వితీయ శ్రేణి నేతల్లో రాకుండా చూస్తున్నారు. వారిని కూడా ప్రజలకు జవాబుదారీ చేస్తున్నారు. ఇది గ్రామాల్లో టీడీపీపై మరింతగా అభిమానం పెంచుకోవడానికి కారణం అవుతోంది.