Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
- By Latha Suma Published Date - 11:36 AM, Wed - 19 February 25

Srisailam : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మండపాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయ అధికారులు ముస్తాబు చేశారు. ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మార్చి 1వ తేదీ వరకు జరగనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
Read Also: Congress Vs BJP : కాంగ్రెస్ – బిజెపిల మధ్య ‘రంజాన్’ రాజకీయం
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అదనపు క్యూలైన్ల నిర్మాణం, తాత్కాలిక వసతి, పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆలయ పరిధిలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడంతో కొత్త కళను సంతరించుకుంది. బుధవారం రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు.
కాగా, ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బ్రహ్మోత్సవాలలో పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని.. అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు సిద్దమయ్యారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో సాధారణ భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు ‘చంద్రావతి కల్యాణ మండపం’ వద్ద నుంచి మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనంను ఫిబ్రవరి 23 వరకు కల్పిస్తారు.