Lokesh : తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో లోకేశ్ భేటీ..రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్ సింగపూర్‌లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
- By Latha Suma Published Date - 01:30 PM, Mon - 28 July 25

Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రుల బృందం కూడా పాల్గొంటోంది. ముఖ్యంగా ఐటీ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ఈ బృందంలో భాగమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ రోజు నారా లోకేశ్ సింగపూర్‌లోని తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వాలంటీర్లు, తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వారితో మాట్లాడుతున్న సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. గత అయిదేళ్లలో రాష్ట్ర పాలన పూర్తిగా విధ్వంసాన్ని చవిచూసింది. అలాంటి సమయంలో కూడా విదేశాల్లో ఉన్న తెలుగువారు రాష్ట్రాన్ని కాపాడే లక్ష్యంతో ముందుకొచ్చారు. వారి నిబద్ధత, చిత్తశుద్ధి అభినందనీయం అన్నారు.
Read Also: Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
తెలుగువారి సంఘీభావమే తమకు బలమని పేర్కొన్న లోకేశ్ ఏ దేశానికి వెళ్లినా ముందుగా అక్కడి తెలుగు సముదాయాన్ని కలవాలనే నిర్ణయం సీఎం చంద్రబాబు గారు తీసుకున్నారు అని తెలిపారు. ఇది వారు రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమకు, ప్రజల పట్ల నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. సింగపూర్ అభివృద్ధి మోడల్‌ను ప్రస్తావిస్తూ, లోకేశ్ స్పష్టం చేశారు. ఈ నగరం అభివృద్ధిలో చేసిన ప్రయాణం మనందరికీ స్పూర్తిదాయకం. ఇక్కడి తెలుగువారు కూడా తమ విలువైన మద్దతుతో రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను తీసుకురావడంలో డయాస్పోరా కీలక పాత్ర పోషించగలదని, అందుకు ప్రభుత్వం ప్రతి అవకాశం ఉపయోగించుకుంటుందన్నారు.
ఇక, ఇటీవల ఏర్పడిన డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ఊపిరి లభించిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం, సహకారం పెరిగినందువల్ల అభివృద్ధి పునరుత్థానం సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ పాత్రను గుర్తు చేస్తూ, ఆయన త్వరలో సింగపూర్ పర్యటనకు రావొచ్చని వెల్లడించారు. ఆ పర్యటనలో కూడా తెలుగువారు భారీ స్థాయిలో పాల్గొని, తమ మద్దతు చాటాలి అని పిలుపునిచ్చారు. ప్రధాని సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన మద్దతు అనూహ్యమైనది. అందుకే ప్రధాని మోడీ గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన వాలంటీర్లకు లోకేశ్ అభినందనలు తెలిపారు. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, ప్రతి ఒక్కరి సేవను గుర్తిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.