Fibernet : ఏపీ ఫైబర్ నెట్ కీలక నిర్ణయం..410 మంది ఉద్యోగుల తొలగింపు..!
వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు.
- By Latha Suma Published Date - 05:01 PM, Tue - 24 December 24

Fibernet : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో నియమితులైన ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో తొలి విడతగా 410 మందిని తొలగించింది. మరో రెండు వందల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు. ఎక్కువ మందిని అవసరం లేకున్నా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు.
కొందరు సిబ్బంది వంట మనుషులు, డ్రైవర్లను ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా నియమించారన్నారు. వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని జీవీ రెడ్డి తెలిపారు. అందుకే వీరిని గుర్తించి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక ప్రక్షాళన చేపట్టిన జీవీ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అక్రమ నియామకాలపై దృష్టిపెట్టడంతో పాటు ఫైబర్ నెట్ కనెక్షన్ల ఛార్జీల తగ్గింపు, కొత్త కనెక్షన్లను తక్కువ ధరకే ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఫైబర్‌నెట్ నుంచి రూ. కోట్లు దుర్వినియోగం జరిగిందని వెల్లడించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ వైఖరితో సైబర్‌నెట్ దివాలా అంచుకు చేరిందని అన్నారు. ఫైబర్‌నెట్ నుంచి ప్రముఖ దర్శకుడు ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారని తెలిపారు. డబ్బు చెల్లించేందుకు ఆర్జీవీకి 15 రోజుల సమయం ఇచ్చామని, గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాము కక్ష , దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని, ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామన్నారు. అవసరం మేరకు ఉద్యోగులను తీసుకుంటామని జీవీ రెడ్డి స్పష్టం చేశారు.