Kethireddy : జగన్ కంటే కేతిరెడ్డే బెటర్..ఏ విషయంలో అనుకుంటున్నారు..?
Kethireddy : గత పదేళ్లుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి తన సోషల్ మీడియా టీమ్‌ను నడిపించారు
- By Sudheer Published Date - 07:36 AM, Mon - 3 February 25

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (jagan) ప్రస్తుతం రాజకీయంగా తక్కువగా కనిపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయినా, ఆయన మీడియా ముందు పెద్దగా రాలేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీ నేతల్లో ఎవరు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారంటే.. అది కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డే (Kethireddy Venkatarami Reddy) అని చెప్పాలి. ధర్మవరం నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డికి సోషల్ మీడియాపై ప్రత్యేక ఆసక్తి ఉంది. గత పదేళ్లుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి తన సోషల్ మీడియా టీమ్‌ను నడిపించారు. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరుతో ఆయన వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యేవి. అయితే, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఈ ప్రచార కార్యక్రమాలను నిలిపివేశారు.
VSR : నందమూరి కుటుంబంతో సరదాగా గడిపిన విజయసాయి రెడ్డి
ఇటీవల కేతిరెడ్డి తిరిగి యూట్యూబ్ ఇంటర్వ్యూలతో హడావిడి చేస్తున్నారు. కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలిచ్చి కూటమి నేతలను పొగుడుతూ, సినీ హీరోలను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. హిందూపురం కాబట్టే బాలకృష్ణ గెలిచారని, గుడివాడ అయితే గెలిచేవారు కాదని చెప్పడం ఆయన మాటలను మరింత వైరల్ చేసాయి. అల్లు అర్జున్ కాదు, రష్మిక కోసం తొక్కిసలాట జరిగిందంటూ చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. కేతిరెడ్డి ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన అనుచరులు, క్యాడర్ ఎక్కువగా బీజేపీ లేదా కూటమి పార్టీల వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, కేతిరెడ్డి మాత్రం రాజకీయంగా ఎటువైపు వెళ్లాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా తన ఇంటర్వ్యూలతోనే హైలైట్ అవుతున్నారు. జగన్ కంటే తనకే ఎక్కువ ప్రజాదరణ ఉందనేలా ఆయన సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ పొందుతున్నారు. రాజకీయంగా ఎదగాలంటే కేవలం సోషల్ మీడియా ప్రచారం సరిపోదని, నిజమైన బలం మైదానంలో నిరూపించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి కేతిరెడ్డి రాజకీయ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి.