Kanipakam: కాణిపాకం ఆలయంలో అపచారం.. వినాయకునికి విరిగిన పాలతో అభిషేకం
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఓ దారుణమైన అపచారం చోటుచేసుకుంది.
- Author : Kavya Krishna
Date : 10-07-2025 - 5:17 IST
Published By : Hashtagu Telugu Desk
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఓ దారుణమైన అపచారం చోటుచేసుకుంది. స్వామివారి అభిషేకానికి పాడైపోయిన (విరిగిన) పాలను ఉపయోగించడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే, కాణిపాకం ఆలయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్షీరాభిషేకం పరంపరగా నిర్వహిస్తుంటారు. అయితే, బుధవారం సాయంత్రం జరిగిన అభిషేకంలో నాసిరకం, పాడైన పాలను వినాయకునికి సమర్పించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. పాల సరఫరా బాధ్యతలో ఉన్న కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యంతో పాడిన పాలను పంపించాడని తెలుస్తోంది.
ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రద్ధతో వచ్చిన భక్తులకు ఇది తీవ్ర మనోవేదన కలిగించిందని వారు వ్యాఖ్యానించారు. ఇది కేవలం అపచారం మాత్రమే కాదు, స్వామివారి పట్ల అగౌరవంగా కూడా భావిస్తున్నారని చెప్పారు.
ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందిస్తూ, తప్పిదానికి కారణమైన కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఆలయ పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ ఘటన నేపధ్యంలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆలయంలో స్వామి వారికి అభిషేకం కోసం భక్తులకు ఇచ్చే పాలప్యాకెట్లు సైతం అలాగే ఉండటంతో భక్తుల్లో అసహనం నెలకొంది. దీంతో ఆలయ అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Kothapalli Lo Okappudu: ట్రైలర్‌తో ఆకట్టుకుంటున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’