AP Floods: వరద బాధితులకు రేషన్ సరుకులు, రూ.2 వేలు సీఎం జగన్ ఆదేశం
ఏపీలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
- Author : Naresh Kumar
Date : 17-07-2022 - 1:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితులకు సత్వరం సహాయం అందించాలని సూచించారు. వరదల కారణంగా ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకుండ చర్యలు తీసుకోవాలన్నారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు వాటిని చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలన్నారు. సహాయక చర్యల విషయంలో ఎక్కడ అలసత్వం కనిపించకూడదని ఆదేశించారు.
సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలన్నారు. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు.ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, సహాయ చర్యలపై ఆరా తీశారు. ముంపు గ్రామాలు, ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం.. మందులు సహా అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులకు సైతం తగిన ఆదేశాలు జారీ చేశారు.సహాయ బృందాలను వినియోగించుకుంటూ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్దేశించారు. మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.