Lokesh : జై పవన్..జైజై లోకేష్.!
రాజకీయ నాయకులు ఎవరు ఏది చేసినా..దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. సామాన్యుల మాదిరిగా సాదాసీదాగా ఏదీ రాజకీయ నాయకులు సాధారణంగా చేయరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన కార్యాలయంలోకి వెళ్లడం వెనుక పరమార్థం ఏంటి?
- By CS Rao Published Date - 04:50 PM, Sat - 18 December 21

రాజకీయ నాయకులు ఎవరు ఏది చేసినా..దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. సామాన్యుల మాదిరిగా సాదాసీదాగా ఏదీ రాజకీయ నాయకులు సాధారణంగా చేయరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన కార్యాలయంలోకి వెళ్లడం వెనుక పరమార్థం ఏంటి? అనే దానిపై పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయింది. ఏదో సరదాగా వెళ్లాడని టీడీపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ నమ్మశక్యం కాకుండా ఉంది.2014నుంచి 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే. సంకీర్ణ కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఆపార్టీల మధ్య పొత్తు కాస్తా.. శతృత్వంగా మారింది. ఆ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కారణంకాదనే విషయాన్ని చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు ఎత్తిపొడిచారు. జనసేనాని పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. 2019ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీని టీడీపీ టార్గెట్ చేసింది.
రాజకీయ పరమైన, వ్యక్తిగత విమర్శలను పవన్ మీద టీడీపీ చేసింది. ప్రతిగా పవన్ కూడా అనేక వేదికలపై చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేశాడు. లోకేష్ ను సీఎంచేయడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నాడని విమర్శించాడు. వారసత్వ రాజకీయాలపై పవన్ పలు వేదికలపై విమర్శలు గుప్పించాడు. సీన్ కట్ చేస్తే…జనసేన, బీజేపీ, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసి భంగపడ్డాయి. జనసేన, బీజేపీలకు డిపాజిట్లు చాలా చోట్ల గల్లంతుఅయ్యాయి. 23మంది ఎమ్మెల్యేలకు టీడీపీ పరిమితం అయింది.2019లో జరిగిన నష్టాన్ని మూడు పార్టీలు తెలుసుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఆ క్రమంలోనే లోకేష్ ఒక అడుగు ముందుకేశాడు. ఆయనపై జన సైన్యంకు ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. 2019లో పొత్తు బెడిసికొట్టడానికి, పవన్ మీద వ్యక్తిగతవిమర్శలు సోషల్ మీడియాలో రావడానికి లోకేష్ అండ్ టీం కారణమని జనసేన చాలా కాలంగా భావిస్తోంది. ఆ అపవాదును చెరిపేసుకునే క్రమంలో జనసేన కార్యాలయానికి లోకేష్ వెళ్లాడని టాక్.స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ,జనసేన కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. టీడీపీ ఆఫీస్ లపై వైసీపీ బీపీ బ్యాచ్ దాడులు చేసినప్పుడు పవన్ రియాక్ట్ అయ్యాడు. విగ్రహాల కూల్చివేతలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, అమరావతి రాజధాని తదితర అంశాలపై ఒకే విధానం రెండు పార్టీల్లోనూ ఉంది. పైగా కలిసి పోరాటం చేస్తున్నాయి. రాబోవు రోజుల్లో మళ్లీ 2014 తరహా పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ జనసేన మంగళగిరి ఆఫీస్‌కు ఎంట్రీ ఇవ్వడం పొత్తుకు పునాది వేసినట్టు అయిందన్నమాట.