Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Author : Vamsi Chowdary Korata
Date : 11-05-2026 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ను ప్రధాని స్వయంగా వెళ్లి పలకరించారు. ఆదివారం హైదరాబాద్‌లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ, తన పర్యటన ముగించుకుని నేరుగా పవన్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ భేటీలో పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాతే తిరిగి విధుల్లో చేరాలని, అప్పటివరకు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. “ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, పనుల గురించి ఆ తర్వాత ఆలోచించవచ్చు” అని మోదీ చెప్పినట్లు సమాచారం. పవన్ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఆయన పిల్లలతో ప్రధాని ఆప్యాయంగా ముచ్చటించారు.
ఈ పరామర్శ అనంతరం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ తన భర్తకు ఇచ్చిన సలహాను, తనకు చెప్పిన మాటలను ఆమె తన పోస్టులో పంచుకున్నారు. “ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, పూర్తిగా కోలుకున్నాకే పని మొదలుపెట్టాలని ప్రధాని మోదీ నా భర్తకు చెప్పారు. అలాగే నన్ను చూసి ‘మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి’ అన్నారు. ఆ పని నేను ఎంతో సంతోషంగా చేస్తున్నాను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధాని మోదీకి నేను మాటిచ్చాను” అని అన్నా లెజినోవా తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో పవన్ కుటుంబ సభ్యులు దిగిన ఫొటోలు, అన్నా లెజినోవా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ పోస్టుపై స్పందిస్తూ, తమ నేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి ఈ పరామర్శ నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.