Fake Posts : సోషల్ సైకోల బాధితుల్లో నేను ఒకరిని : వైఎస్ షర్మిల
Fake Posts : రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో.. వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు.
- By Latha Suma Published Date - 07:35 PM, Thu - 7 November 24

YS Sharmila : మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారని.. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా.. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు.. సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని..ఆమె అన్నారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా, ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా.. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో.. వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు.
సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా ,…
— YS Sharmila (@realyssharmila) November 7, 2024
నేను కూడా సోషల్ మీడియా సైకో బాధితుల్లో ఒకరిని. నాతో సహా నా తల్లి విజయమ్మ, సునీతలపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. అసభ్యకర పోస్టులతో పరువు, ప్రతిష్ట దెబ్బతీసే పోస్టులు పెట్టారు. అలాంటి పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు కూడా మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డిపై కేసు పెట్టాను. సైకోలా పోస్టులు పెట్టిన అతని అరెస్టును స్వాగతిస్తున్నా. దారుణమైన పోస్టులు పెట్టే వారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలి.’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాననానికి పాల్పడాలంటే.. భయపడేలా అనునిత్యం చర్యలు కొనసాగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రా రెడ్డి తీరును మండిపడ్డారు. అతడిని సైకో అంటూ దూషిస్తూ.. అతడికి తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో వర్రా రవీందర్ రెడ్డిపై తనను, తన కుటుంబంపై చేసిన పోస్టులను షర్మిల గుర్తు చేసుకున్నారు.