Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 03-07-2026 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
వాయవ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు.
ఇవాళ శ్రీకాకుళం, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంటున్నారు. వర్షాలు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరోవైపు హాస్పిటల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ (HDMP) సౌత్ జోన్ వర్క్‌షాప్ ప్రారంభమైంది. NIDM సౌత్ క్యాంపస్ (కొండపావులూరు)లో రెండు రోజుల సౌత్ జోన్ వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. విపత్తుల సమయంలో ప్రజారోగ్య రక్షణ, అంతరాయం లేని వైద్య సేవల కోసం ఆసుపత్రుల సన్నద్ధతను పటిష్టం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కార్యక్రమంలో NDMA సభ్యులు కృష్ణ ఎస్. వత్స, కేంద్ర ఆరోగ్య శాఖ జేఎస్ జి.ఎస్. చిత్ర, AP, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సౌత్ రీజినల్ పరిధిలోని వివిధ ఎయిమ్స్ (AIIMS) వైద్య నిపుణులు సందర్శించారు. విపత్తుల ప్రమాద తీవ్రతను తగ్గించడంలో ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ఏపిఎస్డీఎంఏ జిఐఎస్ ఎక్స్పర్ట్ ధర్మాన హరీష్ నాయుడు వివరించారు. కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితులు, భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ‘విపత్తు సేవకులు’గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యులకు విపత్తుల నిర్వహణ చక్రం (Disaster Management Cycle)పై పూర్తి అవగాహన కల్పించారు.