Heavy Rainfall: ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు .. ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ!
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా.
- By Gopichand Published Date - 04:52 PM, Sun - 17 August 25

Heavy Rainfall: ఆంధ్రప్రదేశ్‌లో రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కూడా ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి.
ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ ఉన్నాయి. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా. ఈ వర్షాల వల్ల రోడ్డు మార్గాలపై రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
Also Read: Election Commission: ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం!
మత్స్యకారులకు హెచ్చరిక
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
అధికారుల అప్రమత్తం
రాష్ట్రంలో సంభావ్య వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి అధికారులు అప్రమత్తమయ్యారు. విపత్తుల నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా నదులు, వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాల వల్ల నదులలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.