Heavy Rains : ఏపీలోఈ నెల 25 వరకు భారీవర్షాలు.. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్
గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు ముందుకు సాగడంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో
- By Prasad Published Date - 10:18 AM, Thu - 22 June 23

గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు ముందుకు సాగడంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. విజయవాడలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం మారగా, నగరంలోని కొన్ని చోట్ల వర్షం, చిరుజల్లులు కురిశాయి. ఇప్పటి వరకు బెజవాడ వాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవ్వగా..వాతావరణం చల్లపడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర కోస్తా, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. జూన్ 22న ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. జూన్ 23 నుంచి 25 వరకు ఉత్తర కోస్తా, యానాం మీదుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.