Gas Booking Service : ఏపీలో ఈరోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం
Gas Booking Service : ఈ పథకం ప్రకారం..అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, 2015 ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు మరొకటి, జూలై 1 నుంచి నవంబర్ వరకు దశల వారీగా మొత్తం మూడో సిలిండర్ ఉచితంగా అందించబడుతుంది. వినియోగదారులు నేడు గ్యాస్ బుకింగ్ చేస్తే, దీపావళి రోజున వారి సిలిండర్ డెలివరీ అందుబాటులో ఉంటుంది.
- By Latha Suma Published Date - 01:48 PM, Tue - 29 October 24

Free Cylinder Scheme : ఏపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం.. ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలసిందే. ఈ మేరకు దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. తొలి విడత చెల్లింపుల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.895 కోట్లు విడుదల చేసింది. డీబీటీ విధానంలో ఉచిత సిలిండర్ నగదును లబ్ధిదారుని ఖాతాలో జమ చేయనుంది.
ఈ పథకం ప్రకారం..అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, 2015 ఏప్రిల్ 1 నుంచి జూలై వరకు మరొకటి, జూలై 1 నుంచి నవంబర్ వరకు దశల వారీగా మొత్తం మూడో సిలిండర్ ఉచితంగా అందించబడుతుంది. వినియోగదారులు నేడు గ్యాస్ బుకింగ్ చేస్తే, దీపావళి రోజున వారి సిలిండర్ డెలివరీ అందుబాటులో ఉంటుంది.
అయితే, సిలిండర్ పొందేందుకు వినియోగదారులు ముందుగా రూ. 811 చెల్లించాలి. ఈ చెల్లింపు రెండు రోజుల్లో వారి బ్యాంక్ అకౌంట్లలో తిరిగి జమ అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ ఉచిత సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. బుకింగ్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఏర్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలనే సూచన ఇచ్చారు అధికారులు.
ఇకపోతే..ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఆయిల్ కంపెనీ యాప్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది. బుక్ చేయగానే లింక్ అయిన నంబర్‌కు మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.