Simhachalam : నీ దగ్గరికి రావడమే మీము చేసిన పాపమా..? మృతుల బంధువుల ఘోష !
Simhachalam : “నీ దగ్గరికి రావడమే మేము చేసిన పాపమా?” అంటూ వారి బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
- By Sudheer Published Date - 12:51 PM, Wed - 30 April 25

విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో జరిగిన చందనోత్సవ వేడుకల్లో (Chandanotsavam festival) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలో తాజాగా నిర్మించిన లోపలి రిటైనింగ్ వాల్ కూలి (wall collapses), ఏడుగురు భక్తులు ప్రాణాలు (7 killes) కోల్పోయారు. గాలివాన సమయంలో టెంట్‌కు ఏర్పాటుచేసిన స్తంభాలు రిటైనింగ్ వాల్‌పై పడడంతో అప్పటికే వర్షంతో తడిచిన గోడ నెరపకుండా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మధురవాడ సమీపంలోని చంద్రం పాలం గ్రామానికి చెందిన మహేశ్, శైలజ, వారి తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జూరి మహాలక్ష్మిలు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
ఈ విషాదకర సంఘటన మృతుల కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. “నీ దగ్గరికి రావడమే మేము చేసిన పాపమా?” అంటూ వారి బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. దేవాలయ దర్శనానికి వెళ్లిన వారి ఆఖరి దశ ఈ విధంగా ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. సింహాచల ఘటనలో కోనసీమ జిల్లా కొర్లపాటిపాలెంకు చెందిన ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. వారు ఉద్యోగాల నిమిత్తం విశాఖ వాసులుగా ఉంటూ, ఈ ఉత్సవానికి హాజరయ్యారు. సంబంధం లేని కారణాలతో అమాయక భక్తులు బలైపోవడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్, సీపీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయపడినవారికి వైద్య సేవలు అందించడంతో పాటు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల చొప్పున పరిహారం, గాయపడినవారికి 3 లక్షలు ప్రకటించింది. అలాగే దేవాదాయశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి మోదీ పీఎం రిలీఫ్ ఫండ్ నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.