Former MLA Gone Prakash: ప్రధాని మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ బహిరంగ లేఖ
గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
- By Gopichand Published Date - 02:45 PM, Sat - 30 November 24

Former MLA Gone Prakash: ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ (Former MLA Gone Prakash) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలోఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. అందులో గౌతమ్ అదానీ అవినీతితోపాటు గతంలో ఏపీలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జరిగిన అక్రమాలపై రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి లేదా సీబీఐ లేదా జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని ప్రధానిని గోనె ప్రకాష్ కోరింది. అదానీ అక్రమాలు, వాటికి సహకరించిన మాజీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అవినీతికి సహకరించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసి, ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అదానీ గ్రూప్ తో జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల 25 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడే భారం రూ.1.50 లక్షల కోట్లు కాబట్టి వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
విదేశాల్లో అవినీతికి పాల్పడి దేశానికి చెడ్డపేరు తెచ్చిన అదానీని మీరు వెనకేసుకొని రాకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో రాసుకొచ్చారు. అదానీ అవినీతితో అంటకాగిన వైసీపీ అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌తో సహా అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదానీపై ఈడీ, సీబీఐ విచారణకు మోదీ ఆదేశించాలని, అదానీతో పాటు జగన్‌పై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: land Acquisition Notification : లగచర్ల మల్టీపర్సస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని డిమాండ్ చేశారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి రూ.1750 కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్లు అమెరికా కోర్టలో తీవ్ర అభియోగాలు మోపబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
దిగ్గజ వ్యాపారవేత్తగా పేరున్న అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. 2021 డిసెంబర్ 1న 7వేల మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రంలో రైతుల కోసం ఈ విద్యుత్‌ను వినియోగించనున్నట్లు అప్పుడు ప్రకటించారని, ఈ ఒప్పందం అంత్యంత కారుచౌక అని, విద్యుత్ కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయంగా గొప్పలు చెప్పుకున్నారని ఆయన గుర్తుచేశారు. కానీ అదానీ దగ్గర నుంచి గుజరాత్ యూనిట్ ధర రూ.1.99 పైసలకు కొంటుంటే, అంధప్రదేశ్ మాత్రం యూనిట్ ధర రూ.2.49 పైసలుగా అగ్రిమెంట్ చేసుకుంది. గుజరాత్ కంటే 50 పైసలు ఎక్కువ పెట్టి కొన్నారని ఆయన గుర్తుచేశారు.
అంతర్జాతీయంగా దేశం పరువు తీసిన అదానీ చీకటి ఒప్పందాలు, వ్యాపారాలపై విచారణ జరిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో జగన్ పాలనలో ప్రభుత్వంతో అక్రమంగా ఒప్పందాలు చేసుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టిన అదానీ అక్రమ వ్యాపారాలను వెలికితీసి అదానీ, జగన్‌లతో పాటు ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న అందరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటేనే ప్రధాని మోదీ కూడా నిజాయితీకి, విలువలకు కట్టుబడినవారిగా నేను విశ్వసిస్తానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.