Chandrababu meets CJI: మూడేళ్ల తరువాత అపూర్వ కలయిక
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మధ్య సన్నిహిత సంబంధాలుఉన్నాయి.
- Author : CS Rao
Date : 20-08-2022 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మధ్య సన్నిహిత సంబంధాలుఉన్నాయి. కానీ, మూడేళ్లుగా ఒకచోట వాళ్లిద్దరూ కనిపించలేదు. ఇటీవల ఆయన కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చినప్పటికీ చంద్రబాబును కలుసుకోలేకపోయారు. ఒకటిరెండు సందర్భాల్లో హైదరాబాద్, విజయవాడ కేంద్రంగా కలుసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ వాళ్లిద్దరూ ఏకాంతంగా కలిసిన సందర్భాలు లేవు. కానీ, శనివారం వాళ్లిద్దరూ కలుసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.
విజయవాడలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను ముఖ్యమంత్రితో కలిసి సీజేఐ ప్రారంభించారు. ఆ సందర్భంగా సీజేఐ ఒక ప్రైవేటు హోటల్ లో బస చేశారు. అక్కడే జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన చంద్రబాబు ఆయనకు వెంకటేశ్వరుని ప్రతిమను అందించి సత్కరించారు. అక్కడే సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. అదే సమయంలో చంద్రబాబు సీజేఐతో సమావేశమై ఉన్నారు. ఆ సందర్భంగా అక్కడ కనిపించిన దృశ్యం, ప్రోటోకాల్ టెన్షన్ నెలకొంది. అమరావతి శంకుస్థాపన జరిగిన రోజు ప్రధాని మోదీ వచ్చిన రోజు జస్టిస్ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. ఆ తరువాత అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం 2019 ఫిబ్రవరిలో జరిగింది. నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హైకోర్టు భవనాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి హైదరాబాద్ – అమరావతి వచ్చిన సందర్భాల్లోనూ చంద్రబాబు ఆయనతో సమావేశం కాలేదు.
హైదరాబాద్ లో సీజేఐ హోదాలో తొలి సారి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాజ్ భవన్ లో బస చేసిన సీజేఐ ను అనేక పార్టీల నేతలు కలిసినప్పటికీ చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఇక, ఏపీ పర్యటన సమయంలో పూర్తిగా అధికారిక కార్యక్రమాలే షెడ్యూల్ చేశారు. ఇప్పుడు విజయవాడ వచ్చిన సీజేఐ అధికారిక కార్యక్రమాలతో పాటుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.
సీజేఐ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ సీజేఐ గౌరవార్ధం విందు ఏర్పాటు చేశారు. విందులో గవర్నర్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. ఆ తరువాత వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుంటూరు వెళ్తారు. సాయంత్రం స్వగ్రామం పొన్నవరం వెళ్లి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం మీద ఈనెల 27న పదవీ విరమణ చేస్తోన్న జస్టిస్ ఎన్వీ రమణను మూడేళ్ల తరువాత చంద్రబాబు కలవడం హైలెట్ గా మారింది.