Flood Relief Funds: వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతంటే..?
వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ప్రస్తుతం మొత్తం 14 రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయని గణంకాలు చెబుతున్నాయి.
- Author : Gopichand
Date : 02-10-2024 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
Flood Relief Funds: భారీ వర్షాల కారణంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాలు వరదలతో ఇబ్బంది పడ్డాయి. వాహనాలకు బదులు పడవలు రోడ్లపై పరుగులు తీయాల్సిన పరిస్థితి పలు రాష్ట్రాల్లో నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు సామాన్యుల జీవనం పూర్తిగా అతలాకుతలం అవుతోంది. పలు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో వరదల పరిస్థితి నెలకొంది. ప్రజలను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్, స్థానిక పోలీసు బృందాలు నిరంతరం సంఘటనా స్థలంలో మోహరించిన విషయాలు మనకు తెలిసిందే. అయితే మంగళవారం ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం (Flood Relief Funds) నిధులు విడుదల చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది
కాగా వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ప్రస్తుతం మొత్తం 14 రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయని గణంకాలు చెబుతున్నాయి. వారికి సహాయం చేయడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి కేంద్ర వాటాగా, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి ముందస్తు మొత్తంగా రూ. 5,858.60 కోట్ల మొత్తాన్ని హోం మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లోని వరద ప్రభావం, నష్టాలను ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాంలకు ఎక్కువ మొత్తంలో నిధులను మోదీ సర్కార్ విడుదల చేసింది.
Also Read: Monsoon: దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు!
రాష్ట్రాల వారీగా ఎంత సాయం చేశారంటే?
హోం మంత్రిత్వ శాఖ నుంచి మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు 50 కోట్లు అందాయి. మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు ఆర్థిక సహాయం అందించారు. అయితే ఈ వరద సాయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని రూ.10,320 కోట్లు అడిగింది. కానీ కేంద్రం ఇచ్చింది రూ.416 కోట్లు.