I Am With CBN : చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మత్స్యకారులు సముద్రంలో ఆందోళన చేపట్టారు. బవిశాఖపట్నంలోని పెద జాలరిపేట
- By Prasad Published Date - 08:46 AM, Mon - 25 September 23

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మత్స్యకారులు సముద్రంలో ఆందోళన చేపట్టారు. బవిశాఖపట్నంలోని పెద జాలరిపేట మత్స్యకారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ సముద్రంలో పడవలపై నుంచి పార్టీ జెండాలను ఊపుతూ ప్రత్యేక నిరసన చేపట్టారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలు నుంచి ఆయనను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఆందోళనకు మద్దతు ఇచ్చేందుకు బయలుదేరగా ఆయన్ని గృహనిర్భంధం చేశారు. తెలుగుదేశం హయాంలోనే మత్స్యకారుల కుటుంబాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని జీవీఎంసీ టీడీపీ కార్పొరేటర్ నొల్లి నూకరత్నం తెలిపారు. చంద్రబాబు తమకు ఇళ్లు, ఇంటి పట్టాలు ఇచ్చారని.. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును హౌస్ అరెస్ట్ చేయడాన్ని కార్పొరేటర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే విశాఖపట్నం సౌత్ ఇంచార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో తెలుగు మహిళా నేతలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఆర్కే బీచ్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు పార్టీ కార్యకర్తలను పోలీసులు అనుమతించలేదు. వారిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి తరువాత విడిచిపెట్టారు. టీడీపీ నిరసన కారణంగా పోలీసులు ఆర్‌కె బీచ్‌కు సందర్శకులను అనుమతించలేదు.