Raghuveera Reddy : టీడీపీలోకి మాజీ మంత్రి.. ?
- By Hashtag U Published Date - 12:27 PM, Tue - 21 December 21

ఏపీ టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలోకి వలసలు ఎక్కువగా జరుగుతాయి.అయితే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి,ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ లో చేరారు.దీంతో జమ్మలమడుగు నియోజకవర్గానికి భూపేష్ రెడ్డిని ఇంఛార్జ్ గా అధిష్టానం నియమించింది.
తాజాగా మరో సీనియర్ రాజకీయ నాయకుడు దివంగత నేత,మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో మంత్రిగా కీలక పాత్ర పోషించిన రఘువీరారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన రఘువీరారెడ్డి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ప్రభావం చూపడంలేదు. రఘువీరారెడ్డి కూడా తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరావుతున్నారు. దీంతో ఆయన ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్తారని అందరు భావించారు.
అయితే తాజాగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే రఘువీరారెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రఘువీరారెడ్డి టీడీపీలో చేరితే అనంతపురం జిల్లాకి కొంత బలం చేకూరే అవకాశం ఉంది.