APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?
వైఎస్సార్ సీపీ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్న టైంలో గ్రూప్-1 పరీక్ష(APPSC Irregularities)లో అక్రమాలు జరిగాయి.
- By Pasha Published Date - 12:30 PM, Tue - 6 May 25

APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాల కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ‘క్యామ్‌సైన్ మీడియా’ సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మధు కార్యాలయానికి వెళ్లి.. ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ స్కాంలో మధును ఏ2 నిందితుడిగా కోర్టు ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నట్లు సమాచారం.
Also Read :Worlds Toughest Prison: అల్కాట్రాజ్.. ప్రపంచంలోనే టఫ్ జైలు ఎందుకైంది ? రీ ఓపెనింగ్ ఎందుకు ?
హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో జవాబు పత్రాల మూల్యాంకనం
వైఎస్సార్ సీపీ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్న టైంలో గ్రూప్-1 పరీక్ష(APPSC Irregularities)లో అక్రమాలు జరిగాయి. ఏపీపీఎస్సీ ఆఫీసుతో సంబంధం లేకుండా.. గుంటూరులో ఉన్న పర్యాటక ప్రాంతం హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారని దర్యాప్తులో గుర్తించారు. అయితే హాయ్‌ల్యాండ్ అనే పేరు కూడా తమకు తెలియదని ఆనాడు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. తాజాగా జరిగిన దర్యాప్తులో.. హాయ్‌ల్యాండ్‌లో మొదటిసారి మూల్యాంకనం కోసం చేసిన ఏర్పాట్లు, నగదు చెల్లింపుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గ్రూప్1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో చక్రం తిప్పింది పీఎస్‌ఆర్ ఆంజనేయులే అని ఆరోపణలు వస్తున్నాయి. హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్ వేదికగా గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా ధాత్రి మధుకు చెందిన క్యామ్‌సైన్ సంస్థ పొందింది. ఈ కుంభకోణంపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులను ఏ1గా చేర్చారు. ఏ2గా ధాత్రి మధు ఉన్నాడు.
Also Read :China + Pakistan: పాక్ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?
లేఖ రాసినా పట్టించుకోని పీఎస్‌ఆర్ ఆంజనేయులు
పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న టైంలో హాయ్‌ల్యాండ్‌లో డమ్మీ జవాబుపత్రాల మూల్యాంకనం పనులను 2021 డిసెంబరు 3న క్యామ్‌సైన్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థకు 1.14 కోట్ల చెక్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో ఆంజనేయులు ముట్టజెప్పగా, అందులో 74 లక్షల రూపాయల వరకు గోల్‌మాల్ జరిగిందని గుర్తించారు. డిజిటల్ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులకు అనుగుణంగా సిద్ధం చేసిన ఓఎంఆర్ షీట్లపై అర్హత లేనివారితో మార్కులు వేయించారని వెల్లడైంది. మార్కులు వేసిన వారిలో క్యామ్‌సైన్ సంస్థ ఉద్యోగులతోపాటు ఇంటర్, డిగ్రీ వరకు చదివిన స్థానికులు ఉన్నారని తేలింది. వీరికి వేతనంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించినట్లు సమాచారం. జవాబుపత్రాల మూల్యాంకన బాధ్యతలను వేరొకరికి అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఏపీపీఎస్‌సీలోని ఓ సభ్యుడు పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు 2021 డిసెంబరు 14 న లేఖ రాశారు. దీన్ని పీఎస్‌ఆర్ పట్టించుకోలేదు.