CM Jagan : నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ రైతుభరోసా నిధులు విడుదల
నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద నిధులను...
- Author : Prasad
Date : 17-10-2022 - 6:17 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. సుమారు 45 నిమిషాల పాటు ప్రసంగించిన అనంతరం తిరిగి 12.35 గంటలకు విమానంలో గన్నవరం చేరుకుని 2.15 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన పథకాన్ని జగన్ సభా స్థలంలో అధికారికంగా ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా మొత్తాన్ని ఆయన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 2022-23 సంవత్సరానికి గాను రెండవ విడత కింద అందించిన ఆర్థిక సహాయం కోసం, 2,20,497 మంది లబ్ధిదారుల ఖాతాలలో 96 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని జమ చేస్తారు. గతంలో మొదటి విడతలో 2,09,381 మంది రైతులు లబ్ధి పొందారు. ముఖ్యమంత్రి జగన్ సభను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ కూడా తగిన సంఖ్యలో సిబ్బందిని మోహరించింది.