NTR Bharosa Pensions : లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
- By Latha Suma Published Date - 02:51 PM, Tue - 31 December 24

NTR Bharosa Pensions : ఏపీలో ఈ రోజు ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లా యలమందలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు. ఈ సందర్బంగా ఏడు కొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్లుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని.. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం. దీపం పథకం గురించి ఆరా తీసి, ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి, కుటుంబ సభ్యులకు అందించిన చంద్రబాబు గారు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5… pic.twitter.com/luEcljbUp4
— Telugu Desam Party (@JaiTDP) December 31, 2024
కరోనా సెకండ్ వేవ్ సమయంలో శారమ్మ భర్త చనిపోయాడు. వారి కుటుంబ పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న శారమ్మ కూతురుకి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టుకుంటానన్న ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష రుణం, మరో రూ. 2 లక్షలు సబ్సిడీగా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ సొమ్మును రెండింతలు పెంచింది. వృద్ధులకు, వితంతువులు, ఇతరత్రాలకు రూ.4వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ.6వేలు. మంచానికి పరిమితమైన వారితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి రూ.15వేలు ఇస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో, ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి, బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేస్తోంది.
అంతకుముందు యల్లమందలోని కోదండ రామాలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యల్లమందలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని చాకలి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. నాగరాజు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాగరాజు కుటుంబానికి గొర్రెల షెడ్డును నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉంటున్నామని, ఉద్యోగాలు కల్పించాలని కరుణ అనే మహిళ సీఎం చంద్రబాబుని కోరారు. ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.