Naredco Property Show : బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది: సీఎం చంద్రబాబు
నిర్మాణ రంగం ఏపీలో దేశంలోనే ముందుండాలన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు వెళ్తుంది.
- By Latha Suma Published Date - 03:21 PM, Fri - 10 January 25

Naredco Property Show : ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులో నరేడ్కో ప్రాపర్టీ షోని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని చంద్రబాబు విమర్శలు చేశారు. పడకేసిన నిర్మాణ రంగానికి మళ్లీ ఊతమిస్తున్నామని తెలిపారు. నిర్మాణ రంగం ఏపీలో దేశంలోనే ముందుండాలన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు వెళ్తుంది. రాష్ట్ర జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం 7.3 శాతంగా ఉంది.. 2047 నాటికి 20 శాతం పెరుగుతుందని అంచెనా వేస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి రియల్ ఎస్టేట్ రంగం 20 శాతం పెరుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అందుకే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మమ్మల్ని నమ్మి 93 శాతం మంది అభ్యర్థులను గెలిపించారని చంద్రబాబు గుర్తు చేశారు. కొంతమంది అడ్డదారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారని, అడ్డదారుల్లో వెళ్లే వాళ్లతోనే సమస్యలు వస్తున్నాయన్నారు. అక్రమ కట్టడాలను అడ్డుకునే శక్తి ప్రభుత్వానికి ఉందని, డ్రోన్ల ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అన్నీ కుదేలయ్యాయి. చెడు పనులు చేయాలంటే చాలా సులువు.. మంచి పని చేయాలంటే చాలా కష్టం అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తానంటే చాలా సమస్యలు వచ్చాయి. ఉచిత ఇసుక ఇస్తానన్నాం.. అక్కడక్కడ స్వార్థపరులు వస్తున్నారు. డ్రోన్ల ద్వారా అక్రమ కట్టడాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో భూ సమస్యలు విపరీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 100 పిటిషన్లు వస్తే అందులో 60 నుంచి 70 వరకు భూ సమస్యలేనని వివరించారు. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు.