CM Chandrababu : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును తిలకిస్తున్న చంద్రబాబు
చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తాం..చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం..
- By Latha Suma Published Date - 07:37 PM, Wed - 7 August 24

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఉండవల్లి వెళ్తుండగా మధ్యలో ఆగి..ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. దీంతో పలువురు సందర్శకులు సీఎంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణమ్మకు జలకళ రావడం చూసి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఈ నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైసీపీ సర్కారు రద్దు చేసిందని మండిపడ్డారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించిన పార్టీ మాది. బీసీలు.. ఆది నుంచీ పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తాం. చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. వారికి ఆరోగ్యబీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్ చేస్తాం. నేతన్నలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తాం. నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయం చేస్తాం. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలి. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తున్నా. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తాం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తాం అని చంద్రబాబు తెలిపారు.
Read Also: Gujarat ATS: గుజరాత్ లో 800 కోట్ల విలువైన ఎండీ డ్రగ్ స్వాధీనం