Space City : ఏపీలో స్పేస్ సిటీల ఏర్పాటు..30 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
Space City : ఈ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
- By Sudheer Published Date - 11:26 AM, Fri - 27 June 25

ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష రంగంలో ముందంజలో నడిపే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0’ (Chandrababu Space Policy 4.0) రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుపతి, లేపాక్షి ప్రాంతాల్లో స్పేస్ సిటీలను ఏర్పాటు చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ప్రత్యేకంగా ఉండవల్లిలో నిర్వహించిన సమీక్షలో 2025-2035 మధ్య వ్యూహాత్మక స్పేస్ ప్రణాళికలను వివరించారు.
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
లేపాక్షిలో ఏర్పాటు కానున్న స్పేస్ సిటీకి 500 ఎకరాల భూమిని కేటాయించి, అక్కడ డిజైన్, ఆర్‌అండ్‌డి, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తిరుపతిలో మాన్యుఫాక్చరింగ్, లాంచ్ లాజిస్టిక్స్ సేవల కేంద్రంగా స్పేస్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో శాటిలైట్, లాంచ్ వెహికల్ అసెంబ్లీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ భాగాల తయారీకి అనువైన మౌలిక వసతులు అందించనున్నారు. లేపాక్షి బెంగళూరుకు, తిరుపతి శ్రీహరికోటకు సమీపంలో ఉండటం వల్ల స్పేస్ పరిశ్రమల అభివృద్ధికి వీలుగా మారనుంది.
పాలసీలో భాగంగా రూ.1 కోటి నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు మైక్రో నుంచి మెగా స్థాయి దాకా ప్రోత్సాహకాలను రూపొందిస్తున్నారు. 25%-45% వరకు పెట్టుబడి సబ్సిడీలు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహాలు కల్పించనున్నారు. విద్యాసంస్థల భాగస్వామ్యంతో విద్యార్థులను స్పేస్ రంగంలోకి తీసుకురావాలన్నది ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయంగా స్పేస్ ఎకానమీలో భారత్ వాటా కేవలం 2% మాత్రమే ఉండగా, 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల విలువ కలిగిన పరిశ్రమగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది.