CBN Seeks Explaination: కేంద్రమంత్రికి సమాధానం చెప్పకుండా సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతారా…?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అసమర్థత, తప్పిదాలతో వరదల వల్ల 62మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. సీఎం కొద్దిగా విజ్జతతో ప్రవర్తించి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేదని...
- By Hashtag U Published Date - 06:41 PM, Sun - 5 December 21

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అసమర్థత, తప్పిదాలతో వరదల వల్ల 62మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. సీఎం కొద్దిగా విజ్జతతో ప్రవర్తించి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేదని… ఇగో తో వ్యవహరిస్తూ మేం చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిచ్చితుగ్లక్ గా తయారయ్యారని…రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంటు సాక్షిగా అన్న మాటలకు ఏం సమాధానం చెబుతారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచంలో ఇంజనీర్లు ఇదొక కేసు స్టడీగా తీసుకుంటే మనకు అవమానం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల ఓట్లు వేసింది ప్రాణాలు తీయడానికి కాదని..వారిని కాపాడతారని ఓట్లు వేశారన్నారు. 18వతేదీ ఉదయం తుపాను వస్తుందని వాతావరణశాఖ చాలా స్పష్టంగా చెప్పిందని…అయినా ప్రభుత్వ యంత్రాంగం చూస్తు ఊరుకుండిపోయిందన్నారు. ముందుగా హెచ్చిరిక చేసిన తర్వాత కూడా ఉదాశీనంగా వ్యవహరించి ప్రాణాలను బలిగొన్నారని… దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
కలెక్టర్ ప్రకటన ప్రకారం ఉదయం 8.30గంటలకు పించా ప్రాజెక్ట్ లో 3,845 క్యూసెక్కుల నీరు ఉంటే…సాయంత్రం 8.30కి 90వేల క్యూసెక్కులకు చేరిందని … అది అర్థరాత్రికి 1.17లక్షలు వచ్చిందన్నారు. ఇంత భారీగా ప్రాజెక్ట్ లో నీరు చేరుతుంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. వాటర్ ఫ్లో వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసే ఒక వ్యవస్థను క్రియేట్ చేశామని… అన్నింటికీ సైంటిఫిక్ గా తయారుచేసి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ముందుగా హెచ్చరికలు చేసి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ముఖ్యమంత్రి కడప వెళ్లి ఎవరిని బయటకు రాకుండా ఆపడం పరామర్శ ఎలా అవుతుందని చంద్రబాబు ప్రశ్నించారు.