Chandrababu Naidu : ఏజ్ గేమ్, 72లో 27.!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వయస్సును పదేపదే వైసీపీ ప్రస్తావిస్తోంది
- Author : CS Rao
Date : 19-05-2022 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వయస్సును పదేపదే వైసీపీ ప్రస్తావిస్తోంది. అసెంబ్లీ లోపల, బయట ఆయన వయస్సు మీద మైండ్ గేమ్ ను రెండేళ్ల నుంచి ప్రయోగించింది. రాబోవు ఎన్నికల్లోనూ చంద్రబాబునాయుడు వయస్సును ఎత్తిచూపుతూ లబ్దిపొందాలని రాజకీయంగా వైసీపీ ఆలోచిస్తోంది. అందుకే, ప్రతి ప్రెస్ మీట్లోనూ ఆయన చిన్నమెదడు చితికిందని, వయస్సు మీద పడడంతో అల్జీమర్స్ వచ్చాయని, వయోభారంతో ఉన్న బాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని విమర్శించడం తరచూ వింటున్నాం. ఇలాంటి మైండ్ గేమ్ కు చెక్ పెట్టేలా కడప, అనంతపురం జిల్లాల్లోని `బాదుడే బాదుడు` వేదికలపై నుంచి రివర్స్ పంచ్ లు మొదలు పెట్టారు.
అనంతరం జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటకు వెళ్లగా, ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కార్యకర్తల ఉత్సాహాన్ని చూసిన చంద్రబాబు తన వయసు, స్ఫూర్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్ధ౦. “నా వయసు 72 ఏళ్లు, అయితే నా స్ఫూర్తి మాత్రం 27 “అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్న చంద్రబాబు, జాబ్ కేలండర్ ఏమైందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కడప జిల్లాకు ఒక్క పరిశ్రమనైనా తెచ్చిందా? అని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో యువతకు అధిక ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. యూత్ కు రీచ్ అయ్యేలా చేసిన ప్రసంగం మారిన చంద్రబాబు స్పీచ్ కు నిదర్శనంగా ఉంది.
ప్రస్తుతం చంద్రబాబు వయస్సు నిండు 72 ఏళ్లు. ఇటీవల 73వ ఏట అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీ ఆయన వయస్సు మీద ఎక్కువగా మైండ్ గేమ్ ఆడుతోంది. వాస్తవంగా చంద్రబాబు వయస్సు 70 ప్లస్ అయినప్పటికీ 20 ప్లస్ మాదిరిగా పనితీరు ఉంటుంది. ఆయన దైనందిన కార్యక్రమాలు, ఫుడ్, వ్యాయమాలు, యోగ, ఆహార్యం తదితరాలు ఆయన వయసును చాలా వరకు దాచేస్తాయి. అంతేకాదు, అలిపిరి నుంచి తిరుమల శ్రీవారి వద్దకు మెట్ల మార్గాన ఏకబిగిన వెళ్లగలరు. కేవలం రెండున్నర గంటల్లో తిరుమల మెట్లను ఎక్కడం ద్వారా ఆయన శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇటీవల నిరూపించారు. ఇప్పటికీ 18 గంటలు పనిచేసే సత్తా ఉన్న లీడర్ చంద్రబాబు. ఆ విషయాన్ని టీడీపీ క్యాడర్ మాత్రమే కాదు, ఆయనకు సన్నిహితంగా ఒకప్పుడు మెలిగిన వైసీపీ సీనియర్లు కూడా చెబుతుంటారు. పని రాక్షసునిగా పేరున్న ఆయన ఫిట్ నెస్ గురించి అందరికీ తెలిసిందే.
2024 ఎన్నికల నాటికి చంద్రబాబు 74ఏళ్లు వస్తాయని రెండేళ్లుగా వైసీపీ నాయకులు పదేపదే ఎత్తిచూపడం గమనిస్తున్నాం. ప్రత్యేకించి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని పలుమార్లు చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడారు. ఆ తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అనేక సందర్భాల్లో ముసలి నక్క అంటూ చంద్రబాబు వయస్సు మీద దాడికి దిగారు. ఏపీ సీఎం జగన్ కూడా పలు వేదికలపై బాబు వయస్సును ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా చంద్రబాబు వయోభారంను వచ్చే ఎన్నికల నాటికి ఒక అస్త్రంగా తీసుకెళ్లడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ఒక వేళ చంద్రబాబుకు ఓటు వేసినప్పటికీ వయోభారం కారణంగా లోకేష్ సీఎం తెరమీదకు వస్తారని ప్రత్యర్థులు చేస్తోన్న ప్రచారం. ఒక వైపు జగన్ ఇంకో వైపు లోకేష్ ఎవరు మేలు అనే కోణం నుంచి వచ్చే ఎన్నికల స్లోగన్ తీసుకెళ్లడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. అందుకే, చంద్రబాబు వయస్సుపై దాడి చేయడానికి వైసీపీ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ఆ విషయాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పటికీ 20ప్లస్ స్పూర్తితో పనిచేస్తానని చెబుతున్నారు. యువత తరహాలో పనిచేస్తానని పదేపదే చెబుతూ టీడీపీ క్యాడర్ ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వయస్సుపై వస్తోన్న విమర్శలకు రివర్స్ అటాక్ ఇస్తూ చంద్రబాబు వైసీపీ నేతల వ్యూహానికి ఆదిలోనే దెబ్బకొట్టే స్కెచ్ వేశారు. దాన్ని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని `బాదుడే బాదుడు` వేదికలపై నుంచి కార్యరూపంలోకి తీసుకురావడం గమనార్ధ౦.