2024 AP Big Fight: వైసీపీ కంచుకోటలో.. టీడీపీ తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
- Author : HashtagU Desk
Date : 23-02-2022 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ యాక్టీవ్ మోడ్‌లోకి వచ్చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్రంలోని పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టిసారించారు. కడపలోని పులివెందుల నియోజకవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు, ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధిని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో కడప జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)ని ఖరారు చేశారు.
ఇక గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి, ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సతీష్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉన్నా, ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ క్రమంలో సతీష్ రెడ్డి ఏ పార్టీలో లేకపోయనా చంద్రబాబు పులివెందుల అభ్యర్థిగా ఖరారు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థి బీటెక్ రవి. వచ్చే ఎన్నికల్లో బీటెక్ రవి, వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పోటీ పడాల్సి ఉంటుంది.
కడప జిల్లా వైసీపీకి కంచుకోట అనే విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో అక్కడ టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కడప జిల్లాలో టీడీపీ జెండా పాతాలన్న కసితో చంద్రబాబు అండ్ బ్రదర్స్ ఉన్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలో ప్రత్యేక సమావేశాలు పెట్టి, అన్ని నియోజవర్గాలకు ఇంచార్జ్‌లను నియమిస్తున్నారు చంద్రబాబు. ఇక గత ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసిన సతీష్ రెడ్డి తిరిగి వస్తారని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుకు చెప్పగా, పార్టీని వదిలి వెళ్ళిన వారు తిరిగి వచ్చినా, పులివెందుల నుంచి బీటెక్ రవి మాత్రమే పోటీ చేస్తారని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఇక కడప జిల్లా నుండి త్వరలో టీడీపీలోకి చేరికలు ఉంటాయని, అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని, పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే కార్యకర్తలు అందరూ కిందిస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపను పట్టించుకోవడంలేదని, గత ఎన్నికల సమయంలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని, దీంతో వచ్చే ఎన్నికల్లో కడపలో టీడీపీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మరి పులివెందుల్లో జగన్‌ను ఢీకొట్టి, వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొడుతుందో లేదో తేలాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.