IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!
- Author : Vamsi Chowdary Korata
Date : 09-12-2025 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసింది. కాగా, ఈ కొత్త అధికారుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలవారు కూడా ఉన్నారు. ఏపీతో పాటు వివిధ క్యాడర్లకు 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించింది కేంద్రం.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సౌలభ్యం మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి మరో 8 మంది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు కేంద్రం అధికారికంగా లేఖ రాసింది. ఈ కొత్త అధికారులంతా 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు. ఏపీతో పాటు 2024 బ్యాచ్‌కు ఎంపికైన అధికారులను వివిధ రాష్ట్రాల క్యాడర్లకు కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన 8 మంది అధికారుల్లో బన్నా వెంకటేష్, ఏఆర్ పవన్ తేజ (ఆంధ్రప్రదేశ్), కే ఆదిత్య శర్మ, చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హరి ఓం పాండియా (రాజస్థాన్), నమ్రతా అగర్వాల్ (హర్యానా), ప్రియ (ఢిల్లీ), సుయశ్ కుమార్ (ఉత్తర్‌ప్రదేశ్) ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులను ఇతర రాష్ట్రాల క్యాడర్లకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో చెన్నం రెడ్డి శివగణేష్ రెడ్డిని ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, యూనియన్ టెర్రిటరీస్) క్యాడర్‌కు, పీ సురేష్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శక్తి దుబే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆమెకు తన సొంత రాష్ట్ర క్యాడర్ కేటాయించారు. ఇక హర్యానాకు చెందిన రెండో ర్యాంకర్ హర్షిత గోయల్‌ను గుజరాత్ క్యాడర్‌కు, మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంకర్ డోంగ్రే అర్చిత్ పరాగ్‌ను కర్ణాటక క్యాడర్‌కు కేటాయించారు. నాలుగో ర్యాంకర్ షా మార్గి చిరాగ్ (గుజరాత్), ఐదో ర్యాంకర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ)కు తమ రాష్ట్రాల క్యాడర్లు దక్కాయి. కాగా, టాప్ పది మంది ర్యాంకర్లలో ఆరుగురికి తమ సొంత రాష్ట్ర కేడర్ కేటాయించడం గమనార్హం.
కాగా, 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో సైకిల్‌లో మహిళలు అదరగొట్టారు. 2025 ఏప్రిల్‌లో వెల్లడైన ఫలితాల్లో 1,009 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. అయితే టాప్ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళలే ఇండటం గమనార్హం. ఇక టాప్ 5లో ర్యాంకర్లలో ముగ్గురు మహిళలు ఉన్నారు. కాగా, దేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి. ఏటా లక్షల మంది ఈ పరీక్షలకు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.