నివాస భవనాలకూ బిల్డింగ్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Author : Vamsi Chowdary Korata
Date : 07-01-2026 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
Andhrapradesh Govt ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నివాస భవనాలకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ను తప్పనిసరి చేసింది. 4 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఈ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుంది. కాగా, భవన నిర్మాణంలో విద్యుత్ ఆదా, నీటి సంరక్షణ, పర్యావరణ హితమైన మెటీరియల్స్ వాడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక ఈ ఈసీబీసీని అనుసరించి నిర్మించిన నివాస భవనాలను ఎకో నివాస్ సంహితగా ప్రభుత్వం గుర్తిస్తుంది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి
- విద్యుత్ ఆదా చేసేలా ప్రభుత్వం ప్రణాళిక
కొత్తగా నిర్మిస్తున్న నివాస భవనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వాణిజ్య భవనాలకు అమలు చేసిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC)ను నివాస భవనాలకూ తప్పనిసరి చేసింది. ఇకపై 4000 చదరపు మీటర్ల ప్లాట్ ఏరియా కన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస భవనాలకు ఈసీబీసీ వర్తించనుంది. ఈ బిల్డింగ్ కోడ్ తప్పనిసరిగా అమలు చేస్తామని.. సంబంధిత మున్సిపల్ సంస్థల నుంచి అనుమతులు తీసుకునేటప్పుడు హామీ పత్రం సమర్పించాలి. భవన నిర్మాణం పూర్తయ్యాక బిల్డింగ్ కోడ్ అమలు చేసినట్లుగా విద్యుత్ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ సమర్పిస్తే అక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందొచ్చు.
నివాస, వాణిజ్య భవనాలతో పాటు కొత్తగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాల్లోకి గాలి వెలుతురు వచ్చేలా చేసి.. విద్యుత్ ఆదా చేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం. అందుకోసం గ్రీన్ బిల్డింగ్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈసీబీసీని అనుసరించి నిర్మించిన నివాస భవనాలకు ఎకో నివాస్ సంహితగా ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది. అయితే ప్రస్తుతం 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణం, ఆపైన చేపట్టే విల్లాలు, ఇతర భారీ భవంతులకే బిల్డింగ్ కోడ్ వర్తించనుది. ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మించే భవనాలకూ బిల్డింగ్ కోడ్ అమలు చేస్తారు.
కొత్త నిర్మాణాలకు బిల్డింగ్ కోడ్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా చాలా రాష్ట్రాలు పాటించడం లేదు. ఏపీ కూటమి ప్రభుత్వం చొరవతో.. ఈ బిల్డింగ్ కోడ్ అమలుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుమతులు ఇచ్చింది. ఈ బిల్డింగ్ కోడ్‌ను రాష్ట్రంలో అమలు చేయడంలో గతంలో ఏపీ టాప్‌లో నిలిచింది.
ఇలా చేయడం తప్పనిసరి..
మరోవైపు, వెలుతురు, గాలి పుష్కలంగా వచ్చేలా ఇళ్లు, వాణిజ్య భవనాలు నిర్మించాలి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు కూడా ఆ భవనంలో ఉండాలి. అంతేకాకుండా ఎల్‌ఈడీ లైట్లు, తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఇతర ఎలక్ట్రికల్ పరికరాలనే ఉపయోగించాలి. వర్షపు నీటిని సంరక్షించి.. వాటిని పునర్వినియోగానికి వాడుకునేలా ఏర్పాట్లు ఉండాలి. తక్కువ నీరు వినియోగించేలా ట్యాప్‌లు, ఫ్లష్ వ్యవస్థలు కొత్త భవనాల్లో ఉండాలి.
ఇక భవనాల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. పర్యావరణాన్ని కాపాడటం కోసం ఫ్లైయాష్ ఇటుకలు వినియోగించాలి. అంతేకాకుండా భవనాలకు తక్కువ కెమికల్ ఉపయోగించిన పెయింట్ వేయాలి. ఇంట్లో ఉష్ణోగ్రతను నియంత్రించేలా.. హీట్ రిఫ్లెక్టింగ్ రూఫ్, గ్రీన్ రూఫ్, గోడల ఇన్సులేషన్ వంటివి చేయించాలి.