Amaravathi : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Amaravathi : ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నామినేట్ చేసిన వ్యక్తులను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయనున్నారు
- By Sudheer Published Date - 09:39 PM, Fri - 14 February 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం ద్వారా అమరావతిని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నామినేట్ చేసిన వ్యక్తులను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించనున్నారు. రాజకీయ, వ్యాపార, సినిమా, క్రీడా, సాంకేతికత వంటి విభాగాల్లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వారు ఈ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశముంది. ఈ అంబాసిడర్లు అమరావతిని దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించేందుకు కృషి చేయనున్నారు.
అమరావతికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ అంబాసిడర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఐటీ, మానుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు వీరు సహాయపడతారని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ సంస్థలతో సంబంధాలను మెరుగుపరచి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం కల్పించడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ నియామకాలతో అమరావతి నగర ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ అంబాసిడర్లు సాంకేతికత, స్మార్ట్ సిటీ పరిణామాలు, గ్రీన్ సిటీ కాన్సెప్ట్‌లను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. దీనిద్వారా అమరావతి అభివృద్ధికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.