Botsa Satyanarayana : అమరావతిపై కపిరాజు ‘బొత్సా’
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని హంతకునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ సతీమణి విజయమ్మను కన్నీళ్లు పెట్టించాడు.
- Author : CS Rao
Date : 17-12-2021 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని హంతకునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ సతీమణి విజయమ్మను కన్నీళ్లు పెట్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జయహో అంటూ ఆకాశానికి ఎత్తేయడానికి అమరావతిని `స్మశానం` అన్నాడు. ఏపీ రాజధాని అమరావతిని `ఎడారి`గా అభివర్ణించాడు. పశువులు, పందులు తిరిగే బీడుభూమిగా అమరావతిని ప్రచారం చేశాడు. భూములు ఇచ్చిన రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని చేశాడు.
తిరుపతిలో జరుగుతోన్న అమరావతి రైతుల సభను రాజకీయ సభగా బొత్సా భావిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేస్తోన్న ఈవెంట్ గా చెబుతున్నాడు. న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్ర టీడీపీ కార్యకర్తలు చేసిన ఈవెంట్ గా భావిస్తున్నాడు. అదే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళుతున్నాడు. ఏపీ రాజధాని ప్రస్తుతం ఏది అంటే మాత్రం మౌనంగా ఉండిపోతున్నాడు. మూడు రాజధానులు ఉండాలని కోరుకుంటున్నాడు. విశాఖ పరిపాలన రాజధానిగా ఉండాలని అక్కడి ప్రజల్ని కూడగట్టడంలో విజయవంతం అయ్యాడు. ఇప్పుడు రాయలసీమ న్యాయ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న వాళ్లకు మద్ధతు పలుకుతున్నాడు.
ఇవాళ తిరుపతి కేంద్రంగా అమరావతి రైతులు నిర్వహిస్తోన్న మహాసభకు చంద్రబాబు హైలెట్ గా నిలుస్తున్నాడు. ఆయనతో పాటు బీజేపీ, వామపక్షాలు, జనసేన లీడర్లు కూడా ఈ సభకు సంఘీభావం తెలపడం విశేషం. కానీ, మంత్రి బొత్సా సత్యనారాయణ మాత్రం టీడీపీ నిర్వహిస్తోన్న సభగా చూస్తున్నాడు. తిరుపతి కేంద్రంగా శనివారం రోజు జరగనున్న మూడు రాజధానుల మహాసభకు వైసీపీ హాజరు కావాలా? వద్దా? అనే దానిపై ఆలోచనలో పడింది. ఆ మేరకు క్లారిటీని బొత్సా ఇవ్వలేకపోతున్నాడు.
మూడు రాజధానుల మహాసభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తిరుపతి కేంద్రంగా శుక్రవారం రోజున జరిగే అమరావతి రైతుల మహాసభను ఏపీ ప్రభుత్వం క్లోజ్ గా పరిశీలిస్తోంది. దానికి ఏ మాత్రం తగ్గకుండా శనివారం నాడు జరిగే మూడు రాజధానుల సభకు జనాన్ని తరలించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. ఎవరు అవున్నన్నా..కాదన్నా..ప్రత్యక్షంగానో..పరోక్షంగానో…రాజధానుల అంశాన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడలు వేస్తున్నాయి. ఆ క్రమంలో వైసీపీ, టీడీపీ పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంటే పరోక్షంగా బీజేపీ, జనసేన, వామపక్షాల వ్యూహాలు ఉన్నాయి. రైతుల్ని, సెంటిమెంట్ ను ఎవరికి తోచిన విధంగా వాళ్లు వాడేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా తరహాలోనే రాజకీయ అస్త్రంగా రాజధాని అంశాన్ని హైలెట్ చేయడానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నాల్లో మునిగేది ఎవరు? తేలేది ఎవరో..ఇప్పటికే అంచనా వేసిన బొత్సా సత్యనారాయణ ప్రస్తుతం జగన్ పక్షాన నిలిచాడు. ఎన్నికల నాటికి ఆయన నాలుక ఎటు తిరుగుతుందో చూడాలి.