Mega DSC : మెగా డీఎస్సీపై సర్కార్ కసరత్తు.. మార్చిలో నోటిఫికేషన్..?
Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- By Kavya Krishna Published Date - 12:57 PM, Wed - 12 February 25

Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించిన చర్చలు గత సంవత్సరం నుంచే సాగుతున్నాయి. 2023 జూన్‌లోనే ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచించినా, ఎస్సీ వర్గీకరణ సమస్యల కారణంగా ఇది వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి (జూన్ నాటికి) నియామక ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో టీచర్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యామంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Summer Skin Care: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. కేవలం రెండు వారాల్లో మెరిసిపోయి అందం మీ సొంతం!
సమావేశంలో చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే టీచర్ పోస్టుల భర్తీ పూర్తి కావాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, బడులు తెరిచే నాటికి ఉపాధ్యాయులను నియమించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
తల్లికి వందనం పథకం, మత్స్యకార భరోసా వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించాలని, అదే విధంగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి తల్లికి వందనం కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
డీఎస్సీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా భర్తీ చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై అంచనాలు పెంచుకున్న ఉపాధ్యాయ అభ్యర్థులు త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీనిబట్టి చూస్తే, మార్చి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి, జూన్ నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిచేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
Tragedy : రిషబ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి తన ప్రేయసితో ఆత్మహత్యయత్నం.. ఒకరు మృతి