AP High Court : R-5 రగడ, ఈనెల 19కి విచారణ వాయిదా
ఆర్-5 జోన్ పై హైకోర్టు(AP High Court) ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
- By CS Rao Published Date - 01:13 PM, Tue - 4 April 23

ఆర్-5 జోన్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు(AP High Court) ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వానికి, సీఆర్డీఏకు(CRDA) నోటీసులు జారీ చేయడమే కాక, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. అమరావతిలోని ఆర్-5జోన్ పరిధిలో రాజధాని ప్రాంతం వెలుపల ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అమరావతి రైతుల తరపున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాదులు వాదననలు బలంగా వినిపించారు. ఆలకించిన ధర్మాసనం ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయలేమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
ఆర్-5 జోన్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణ (AP High Court)
విచారణ సందర్భంగా భూములను కేవలం రాజధాని అవసరాలకు మాత్రమే వినియోగించాలని గతంలోనే హైకోర్టు(AP High Court) స్పష్టమైన తీర్పునిచ్చిందని రైతుల తరపు లాయర్లు తెలిపారు. కానీ, హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ భూమి పంపకాలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వాదించారు. రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం చట్ట విరుద్ధమవుతుందని బలంగా వాదనలను వినిపించారు. జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఇళ్లు కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.45
అమరావతిలో ఇళ్లు కేటాయించేందుకు సోమవారం ఏపీ ప్రభుత్వం జీవో నెం.45ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రాజధాని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జీవో నెం.45ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. సీఆర్డీఏ పరిధిలో 1,130 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కింద కేటాయించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో నెం.45 తీసుకువచ్చారు. అయితే ఆ భూములను ఇతరులకు కేటాయిస్తుండడాన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read : AP CRDA: `హ్యాపీ నెస్ట్` ప్రాజెక్టు రద్దు?
అమరావతి రాజధానిగా(CRDA) ఉండాలని రాజకీయ పార్టీలు అన్నీ కోరుతున్నాయి. రైతులు మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానుల బిల్లును జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉపసంహరించుకుంది. సీఆర్డీయే చట్టం ప్రకారం అమరావతి ప్రాంతంలోని రైతులకు న్యాయం చేయాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. రైతులతో కుదుర్చుకున్న ఒంప్పందాల ప్రకారం రోడ్లు, డ్రైనేజీలు ఇతరత్రా మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. అందుకు సంబంధించి డెడ్ లైన్ కూడా పెట్టింది. అయితే, ఇటీవల హైకోర్టు (AP High Court)తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిటిషన్ వేసింది. అమరావతి రాజధాని అంశాన్ని త్వరితగతిన విచారించాలని కోరింది. సానుకూల పరిస్థితులు అత్యున్నత న్యాయస్థానం నుంచి లేకపోవడంతో ఆకస్మాత్తుగా జీవో నెంబర్ 45ను విడుదల చేసింది. సీఆర్డీయే పరిధిలో క్రియేట్ చేసిన ఆర్-5 జోన్ పేదలకు ఇస్తూ హడావుడిగా ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
Also Read : Amaravathi: అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!