Covid : కోవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై స్పెషల్ సీఎస్ కృష్ణ బాబు ఉన్నత స్థాయి సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
కేరళ, తదితర రాష్ట్రాలలో తాజాగా కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన
- By Prasad Published Date - 08:14 AM, Wed - 20 December 23

కేరళ, తదితర రాష్ట్రాలలో తాజాగా కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న అధికారులు రాష్ట్రంలో వ్యాధి ప్రభావం స్వల్పమేనని, పొరుగు రాష్ట్రాలలో కొన్ని కేసులు నమోదయి ఆస్పత్రులలో చేరినట్లు తెలుస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన క్రిష్ణబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలని రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలని సూచించారు. దీనితో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలన్నారు. దీనితో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా వుంచాలన్నారు. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు స్వీయ ఏకాంతాన్ని (self isolation)ను పాటించాలని, సంబంధిత లక్షణాలు పూర్తిగా తగ్గేవరకూ ఒంటరి జీవితాన్ని గడపాలని సూచించారు. రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో ప్రజల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.
Also Read: Minister Tummala : రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఏపీలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు.