Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్
Sree Charani: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో కొత్త పేజీని రాసింది. తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచానికి తమ సత్తా చాటింది
- By Sudheer Published Date - 02:36 PM, Wed - 5 November 25
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో కొత్త పేజీని రాసింది. తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచానికి తమ సత్తా చాటింది. ఈ విజయంతో భారత మహిళా క్రికెట్ స్థాయి మరో మెట్టుపైకి చేరింది. ఈ స్ఫూర్తిదాయక విజయంలో భాగస్వామ్యమైన ఆటగాళ్లందరిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. బీసీసీఐతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళా క్రికెటర్లకు బహుమతులు, ఉద్యోగాలు ప్రకటిస్తున్నాయి. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా యువతీ నల్లపురెడ్డి శ్రీ చరణి పేరు గర్వంగా నిలిచింది. ప్రపంచ కప్‌లో ఆమె ప్రదర్శన అంతా దేశం ప్రశంసించే స్థాయిలో ఉంది.
Monalisa : పూసలపిల్ల తెలుగు సినిమా చేయబోతుందా..? ఆ నిర్మాత అదే ప్లాన్ లో ఉన్నాడా..?
వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో చరణి తన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్లను కంగుతినిపించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి భారత బౌలింగ్ విభాగంలో రెండవ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఎడమచేతి స్పిన్నర్‌గా చరణి ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. మిడిల్ ఓవర్లలో ఆమె వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రత్యర్థుల రన్ రేటును తగ్గించింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఎదుర్కొని కీలకమైన వికెట్లు సాధించడం ద్వారా భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఫైనల్లోనూ ఆమె ప్రశాంతత, ఒత్తిడిలో చూపిన స్థిరత్వం, అద్భుతమైన బౌలింగ్ భారత విజయానికి మార్గం సుగమం చేసింది.
ఈ విజయానికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరణికి ఘన సన్మానం చేయడానికి సిద్ధమైంది. విజయవాడకు రానున్న చరణిని గన్నవరం నుంచి భారీ ర్యాలీతో ఆహ్వానించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చరణిని సత్కరించనున్నారు. అదే సమయంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ఆటగాళ్లకు డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో, చరణికీ అదే రీతిలో బంపర్ ఆఫర్ లభించే అవకాశం ఉందని సమాచారం. కడప జిల్లాలోని చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన చరణి విజయగాధ ఇప్పుడు యువతకు ఆదర్శంగా మారింది.