ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్, ప్రజల పై విద్యుత్తు భారాన్ని తగ్గించిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) నాలుగవ నియంత్రణ కాలానికి (4th Control Period) సంబంధించి చేసిన అదనపు ఖర్చులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా, కమిషన్ తుది ట్రూ-అప్ మొత్తాలను ఖరారు చేసింది
- Author : Sudheer
Date : 02-01-2026 - 2:57 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOMs) నాలుగవ నియంత్రణ కాలానికి (4th Control Period) సంబంధించి చేసిన అదనపు ఖర్చులను సర్దుబాటు చేసే ప్రక్రియలో భాగంగా, కమిషన్ తుది ట్రూ-అప్ మొత్తాలను ఖరారు చేసింది. SPDCL, CPDCL, మరియు EPDCL కలిపి మొత్తం రూ. 5,933.44 కోట్ల రూపాయల ట్రూ-అప్ మొత్తాన్ని క్లెయిమ్ చేశాయి. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా కొంత మొత్తం సర్దుబాటు చేయగా, ప్రస్తుతం నికరంగా (Net True-up) రూ.4,497.89 కోట్ల రూపాయలను డిస్కామ్‌లు వసూలు చేసుకోవాల్సి ఉందని కమిషన్ లెక్కతేల్చింది. ఇందులో అత్యధికంగా EPDCL పరిధిలో రూ.1,783.15 కోట్లు, SPDCL పరిధిలో రూ.1,551.69 కోట్లు మరియు CPDCL పరిధిలో రూ.1,163.05 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయి.సాధారణంగా ఇటువంటి భారీ ట్రూ-అప్ మొత్తాలను విద్యుత్ వినియోగదారులపై అదనపు సర్ఛార్జీల రూపంలో నెలకు కొంత చొప్పున వసూలు చేస్తారు. దీనివల్ల సామాన్య ప్రజలపై కరెంటు బిల్లుల భారం విపరీతంగా పెరుగుతుంది.
అయితే, వినియోగదారులకు ఈ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31, 2025న ఇంధన శాఖ (Letter No. ENE01/872/2025) ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా పడకుండా ఈ మొత్తం ట్రూ-అప్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించుకుంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలనే సంకల్పంతో ఈ సాహసోపేతమైన అడుగు వేసింది.కమిషన్ తన ఉత్తర్వులలో డిస్కామ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పట్టికలో చూపిన నికర ట్రూ-అప్ మొత్తాలను ప్రజల నుంచి వసూలు చేయకుండా, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకోవాలని సూచించింది. దీనివల్ల అటు విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు, ఇటు వినియోగదారులు ఆర్థిక భారానికి గురికాకుండా రక్షణ లభించింది. ప్రభుత్వమే ఈ నిధులను నేరుగా డిస్కామ్‌లకు చెల్లించడం ద్వారా విద్యుత్ రంగంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని, తద్వారా నిరంతర విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగదని విశ్లేషకులు భావిస్తున్నారు.