New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!
రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 9 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా, సుమారు రూ. 6,417 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ఏపీఏడీసీఎల్ (APADCL) ప్రతిపాదనలు
- Author : Sudheer
Date : 17-02-2026 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
New Airports : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం మరియు మెరుగైన రవాణా సౌకర్యాలను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 9 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా, సుమారు రూ. 6,417 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ఏపీఏడీసీఎల్ (APADCL) ప్రతిపాదనలు రూపొందించింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ పనులు తుది దశకు చేరుకోగా, మిగిలిన జిల్లాల్లో విమాన కనెక్టివిటీని పెంచడం ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రతిపాదిత విమానాశ్రయాల్లో కొన్ని ఇప్పటికే భూసేకరణ దశలో ఉండగా, మరికొన్ని డీపీఆర్ (DPR) ప్రక్రియలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద రూ. 916 కోట్లతో పీపీపీ విధానంలో పనులు ప్రారంభం కానున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో రూ. 1,142 కోట్లతో విమానాశ్రయ నిర్మాణానికి 444 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. ఇక రాజధాని అమరావతిలో రూ. 1,000 కోట్లతో, శ్రీకాకుళంలో రూ. 650 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. వీటితో పాటు తాడేపల్లిగూడెం, ఒంగోలు, నాగార్జున సాగర్, అనంతపురం మరియు తుని-అన్నవరం ప్రాంతాల్లో విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ విమానాశ్రయాల విస్తరణ కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలవనుంది. విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మరియు చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల వెంబడి ఈ ఎయిర్‌పోర్ట్‌లు రావడం వల్ల పరిశ్రమలకు కావాల్సిన సరకు రవాణా (Cargo) సులభతరం అవుతుంది. ఏపీ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో, జిల్లాల మధ్య అనుసంధానం పెరిగితే విమానయాన రంగం మరింత లాభసాటిగా మారుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ప్రతి జిల్లాను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.