మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
- Author : Sudheer
Date : 30-12-2025 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
- డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు
- బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్లకు పర్మిట్ లైసెన్సులు ఉన్న వారికీ ఒంటిగంట వరకు
- మందుబాబులకు మరియు వ్యాపారులకు ఊరటనిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల (New Year 2026) సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో మందుబాబులకు మరియు వ్యాపారులకు ఊరటనిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తేదీలలో మద్యం విక్రయాల పని వేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రాత్రి 9 లేదా 10 గంటలకే మూతపడే మద్యం దుకాణాలకు, ఈ రెండు రోజుల పాటు అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. పండుగ మూడ్‌లో ఉన్న ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

AP Liquor
మద్యం దుకాణాలతో పాటు వినోద వేదికలు, బార్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని బార్లు, ఇన్-హౌస్ రెస్టారెంట్లు మరియు ప్రత్యేక ఈవెంట్ల కోసం పర్మిట్ లైసెన్సులు పొందిన వారికి రాత్రి ఒంటి గంట (1:00 AM) వరకు మద్యం సరఫరా చేసేందుకు అనుమతి లభించింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే క్లబ్బులు, హోటళ్లు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే, నిర్ణీత సమయం దాటిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు జరుపుకోవాలని పోలీసులు మరియు ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కేవలం ఆదాయం పెంచుకోవడం కోసమే కాకుండా, ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉందని ఎక్సైజ్ శాఖ వివరించింది. పనివేళలు తక్కువగా ఉంటే, ఇతర రాష్ట్రాల నుండి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (పన్ను చెల్లించని మద్యం) మరియు అక్రమంగా తయారు చేసే నాటు సారా రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారిక విక్రయ కేంద్రాల్లో సమయాన్ని పెంచడం ద్వారా అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవచ్చని, తద్వారా కల్తీ మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడవ్వకుండా చూడవచ్చని అధికారులు వెల్లడించారు. వేడుకల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్ పోస్టుల వద్ద నిఘాను కూడా పెంచారు.