Pawan Kalyan: కుమారుడు హెల్త్ పై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే?
తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
- Author : News Desk
Date : 08-04-2025 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan: సింగపూర్‌లోని రివర్ వ్యాలీలో జనసేన అధినేత, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. తాజాగా.. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
పవన్ ఏమన్నారంటే..
స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంప్‌నకు వెళ్లగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో తన కుమారుడికి గాయాలైనట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అరకు పర్యటనలో ఉన్న సమయంలో శంకర్ కు గాయాలైనట్లు నాకు ఫోన్ వచ్చింది. నా కుమారుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వైద్యులు ఇంకా ఏం చెప్పలేదు. రేపు ఉదయం వరకు చెప్తామన్నారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్‌క్యాంప్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని పవన్ చెప్పారు. తొలుత నాకు ఫోన్ వచ్చినప్పుడు అగ్నిప్రమాదం చిన్నదే అనుకున్నా. ఆ తరువాత ఆరాతీస్తే ప్రమాదం తీవ్రత పెద్దదే అని తెలిసింది. నా పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే నా రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరంగా ఉందని పవన్ అన్నారు. ఇవాళ రాత్రి నేను సింగపూర్ కు వెళ్తున్నాను. వెళ్లొచ్చాక మళ్లీ మన్యం జిల్లాలకు వెళ్తానని పవన్ చెప్పారు. అవసరమైన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఈ సమయంలో అండగా నిలిచిన ప్రతీఒక్కరికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్..
సింగపూర్ లో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది.. ఇప్పుడు ఎలా ఉన్నారంటూ పవన్ ను అడిగి ప్రధాని ఆరాతీశారు. శంకర్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించి పవన్ కళ్యాణ్ కు ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన విషయాన్ని మీడియా సమావేశంలో పవన్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా.. తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురికి కృతజ్ఞతలు తెలిపారు.